-మహానగరంలో కదిలే తోట!

0
19

మినీ పార్కును తలపిస్తున్న బస్సు, మనసుంటే మార్గం ఉంటుదంటారు.. నిజ జీవితంలో కొన్ని సంఘటనలు తారసపడినప్పుడు ఈ మాట సరైనదే అనిపిస్తుంది. కేవలం తాపత్రయంతోనే సరిపెట్టుకోకుండా అందుకు ఆచరణ మార్గం వెతికి అనుసరించే వారిని చూసి కచ్చితంగా స్ఫూర్తి పొందాల్సిందే! పర్యావరణాన్ని కాపాడాలనే తపన ఓ వైపు. ప్రభుత్వ ఉద్యోగం మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఎవరైనా రెండోదానికే ప్రాధాన్యమిస్తారు. కోటికొక్కరు మాత్రం వృత్తిని విడిచి సంకల్పం కోసం నడుం బిగిస్తారు. ఈ నేపథ్యంలో తపన, కొలువు రెండింటికీ ప్రాధాన్యమిస్తూ బెంగళూరుకు చెందిన ఓ బస్సు డ్రైవర్‌ ప్రత్యేకత చాటుకుంటున్నారు. ”వృక్షో రక్షతి రక్షితః” అనే మాటను నినాదాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌: అది బెంగళూరు మహా నగరం. అందులో ఓ సిటీ బస్సు. ప్రభుత్వరంగ సంస్థ అయిన బెంగళూరు మెట్రోపాలిటన్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ)కు చెందిన బస్సు అది. అయితే ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా? ఈ బస్సు ఎక్కితే ఓ మినీ ఉద్యానవనంలోకి వచ్చిన అనుభూతి కలగడమే ప్రత్యేకత. విచిత్రంగా ఉంది కదూ! ఈ బస్సు డ్రైవర్‌ నారాయణప్ప ప్రకృతి ప్రేమికుడు. అందుకే ఆయన నడిపే ఈ బస్సులోనూ మొక్కలు మొలిచాయి. బెంగళూరులోని కవాల్‌, బైలసంద్ర, యశ్వంత్‌పూర్‌ ప్రాంతాల మధ్య ఈ బస్సు తిరుగుతుంది. దీనికి తరచూ డ్రైవర్‌గా నారాయణప్ప ఉంటారు. ప్రకృతి పట్ల ప్రేమ ఎక్కువగా ఉన్న ఈయన తన బస్సును మొక్కల కుండీలతో ఇలా పచ్చగా మార్చేశారు. పచ్చదనం పట్ల అవగాహన కల్పించాలనే ఆలోచనే తనతో ఇలా చేయించిందని నారాయణప్ప అన్నారు. అందుకే నాలుగేళ్ల క్రితం నుంచి బస్సులో మొక్కల కుండీలు ఉంచి ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్‌ చేస్తున్న ఈ అవగాహన కార్యక్రమం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభను ఆకర్షించింది. ఆయన్ను అభినందిస్తూ.. ప్రతి పౌరుడు ఈ డ్రైవర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆమె ట్వీట్‌ చేశారు.మహా నగరమైన బెంగళూరులో కాలుష్య స్థాయి ఎక్కువే. ప్రజలు తమకు తామే చొరవ తీసుకొని అవకాశమున్న చోట మొక్కలు పెంచితే బావుంటుందని నారాయణప్ప అభిప్రాయపడ్డారు. అయితే నారాయణప్ప ఆలోచనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల నుంచి బస్సు డ్రైవర్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here