-మీరు తింటున్నది ఇలాంటి మటనా.. అయితే ఓ నిమిషం ఆగండి!!

0
191

పదిహేను రోజులైంది ముక్కలేక.. ముద్ద దిగట్ల. ఈరోజు ఎట్లైనా వీధి చివరన ఉన్న మటన్ కొట్టుకు పోయి పట్టుకొస్తా. మషాలా దట్టించి మాంచి ఘాటుగా కూరొండవోయ్ అంటూ పొద్దున్నే సంచి పట్టుకు బయల్దేరాడు సుబ్బారావు. అప్పటికే అక్కడ జనాలు క్యూలో ఉన్నారు. ఇంకెంతసేపయ్యా బాబూ అని అరుస్తున్నారు. రష్ బావుంది.. ఎలా ఉన్నా కొనేస్తారని ఏదో ఒకటి తోసేస్తున్నాడు మటన్ కొట్టేవాడు. శుభ్రత విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాడు. స్నానం చేసి వచ్చాడో లేదో, కనీసం షాపయినా ఊడ్చాడో లేదో.. ఇంతకీ అది ఫ్రెష్‌దో కాదో ఇలా ఎన్నో డౌట్లు ఉన్నా అడగడానికి టైమ్ లేదు.

త్వరగా తీసుకెళ్లకపోతే మటన్ ఉడకడానికి బోలెడంత టైమ్ పడుతుందని ఇల్లాలితో గొడవ. వెరసి మటన్ కొనేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు మటన్ ప్రియులు. ఇలా అపరిశుభ్ర వాతావరణంలో అమ్మే మటన్ కొంటే రోగాలు మీ వెంటే అంటున్నారు వైద్య నిపుణులు. ప్రధానంగా నెల్లూరు నగరంలో బహిరంగ మార్కెట్లు, మాంసం దుకాణాలు, స్లాటర్ హోట‌ల్‌లో విక్రయిస్తున్న మటన్‌లో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే సూక్ష్మజీవుల ఆనవాళ్లు అధికంగా ఉన్నట్లు జాతీయ మాంసం పరిశోధన కేంద్రం తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రధానంగా జూనోటిక్ వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా సూక్ష్మజీవులు మటన్‌లో 5 నుంచి 8 శాతం ఈ రెండు నగరాల్లో విక్రయిస్తున్న మాంసంలో ఉన్నట్లు తేలింది.

అపరిశుభ్ర మాంసంలో అనేక రోగకారక క్రిములు ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. ఇలాంటి మాంసంలో బ్రూసిల్లోసిస్, లెప్టోస్పైరోసిస్ వంటి సూక్ష్మజీవుల ఆనవాళ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఈ సూక్ష్మజీవులు మాంసం విక్రయదారులు, వినియోగదారుల ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపించడంతోపాటు పలు జీర్ణకోశ వ్యాధులు, జ్వరం తదితర విషపరిణామాలకు దారి తీస్తుంది. ఇటీవల హైదరాబాద్‌తో పాటు దేశరాజధాని ఢిల్లీలో 150 మంది మాంసం వ్యాపారుల రక్తనమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించగా ఈ విషయం వెలుగు చూసింది. ప్రధానంగా ఎలుకలు, పిల్లులు అధికంగా సంచరించే మాంసం దుకాణాలు,

వాటి మలమూత్రాలు విసర్జించే ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో ఈ సూక్ష్మజీవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. మాంసం విక్రయించే వారు చేతికి గ్లౌజులు, ఆప్రాన్‌లు లేకుండా మాంసాన్ని తాకుతుండడంతో ఇవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు తేలింది. మాంసం దుకాణాలపై తనిఖీలు నామమాత్రం. ఫుడ్‌సేప్టీ నిబంధనలను తుంగలో తొక్కి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు దుకాణదారులు. చేతి వేళ్లకు గాయాలున్నవారు, ఇతర ఇన్‌ఫెక్షన్లు జలుబు, దగ్గు వంటివి ఉన్నవారు మటన్ కొడితే వారి నుంచి బ్యాక్టీరియా మాంసంలోకి ఆ తరువాత వినియోగదారుడికి చేరడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అటు వ్యాపారులు, ఇటు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుకాణాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. గొర్రెలను, మేకలను వధించే వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని తెలిపారు. మాంసం పూర్తిగా ఉడికిన తరువాతే ఆరగించాలని సూచించారు. బాధ్యత గల పౌరులుగా ఇలాంటి దుకాణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించమంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here