-వీలున్నంతలో సాటివారిని ఆదుకుందాం – అసహాయుల మధ్య మేయర్ జన్మదిన వేడుకలు

0
50

సేవాభావంతో సాటివారికి సాయం చేయడంలో పరిపూర్ణమైన ఆనందం పొందుతామని, వీలున్నంతలో అసహాయులను ఆదరించి ఆదర్శంగా నిలుద్దామని నగర మేయర్ అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు శనివారం వివిధ సేవా కార్యక్రమాలను నగరంలో నిర్వహించారు. స్థానిక హారనాధపురంలోని మేయర్ నివాసానికి ఉదయంనుంచి పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు చేరుకుని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా రూరల్ సిబిఎన్ ఆర్మీ అధ్యక్షుడు వాసిరెడ్డి చంద్రనాగ్ ఆధ్వర్యంలో సభ్యులంతా కలిసి సేకరించిన 20వేల రూపాయల మొత్తానికి, మేయర్ మరో 30 వేలను జత చేసి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రూరల్ సీబీఎన్ ఆర్మీ సభ్యుడు శివప్రకాష్ వైద్య ఖర్చుల నిమిత్తం ఆ మొత్తాన్ని మేయర్ చేతుల మీదుగా అందజేశారు. బాధితునికి అవసరమైన వైద్య చికిత్స చేసేందుకు నారాయణ వైద్యశాల వైద్యులతో మేయర్ స్వయంగా మాట్లాడి వైద్య విధానంలో పేరు నమోదు చేయించారు.

అనంతరం టిడిపి నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాతంగి కృష్ణ ఆధ్వర్యంలో బుజబుజ నెల్లూరు కూడలిలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మేయర్ పాల్గొని కేక్ కట్ చేసి, జ్యూస్, మజ్జిగలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. తర్వాత అయ్యప్పగుడి వుడ్ కాంప్లెక్స్ లోని ప్రగతి ఛారిటీస్ మానసిక వికలాంగుల పాఠశాలలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన మేయర్, విద్యార్థులకు తినిపించిన తర్వాత వారికి అన్నదానం చేశారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలోని ప్రసూతి, చిన్నపిల్లల విభాగంలోని బాలింతలు, గర్భిణులకు బ్రెడ్, పండ్లను మేయర్ పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాల్లో చివరగా 17వ డివిజన్ నాయకులు ఊటుకూరు దత్తాత్రేయ ఆధ్వర్యంలో స్థానిక బాలాజీనగర్ వేపదొరువు ప్రాంతంలోని గీతామయి వృద్ధుల ఆశ్రమంలో కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు.

జన్మదిన వేడుకలను ఉద్దేశించి మేయర్ మాట్లాడుతూ ఆర్ధిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వేడుకలను అసహాయుల సమక్షంలో చేసుకోవడం ద్వారా అభాగ్యులకు కాసింత మానసిక తోడ్పాటును అందించిన వారవుతామని, ఉత్తమ సేవాగుణానికి ఆదర్శంగా నిలిచేలా అలాంటి కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున ఆసక్తిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న వేసవి తీవ్రత దృష్ట్యా సామాజిక సేవా తత్పరత కలిగిన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావిస్తూ నగర వ్యాప్తంగా తమతమ ప్రాంతాల్లో మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని పిలుపునిచ్చారు. ఎండలు తీక్షణంగా ఉన్న కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎక్కువగా మంచినీరు, మజ్జిగ లాంటి ద్రవాలను మోతాదు మేరకు కచ్చితంగా తీసుకుని సేద తీరాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, పెద్దవయసువారు వేసవి వడగాల్పుల పట్ల అవగాహన పెంచుకుని ఇంటి పట్టునే ఉంటూ, వడదెబ్బకు గురవకుండా జాగ్రత్తలు వహించాలని మేయర్ హితవుపలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here