ZSNEWS / తాగునీటి అవ‌స‌రాల‌కు అధిక ప్రాధాన్య‌త ఇస్తాం – స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో మంత్రి సోమిరెడ్డి

18

ZSNEWS – NELLORE / నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో గురువారం రాష్ట్ర మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంత‌రం సమావేశంలో ప్రధానంగా సాగు, తాగునీటి విషయంపై చర్చించారు.అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ గత నెలలో 67 శాతంగా ఉన్న లోటు వర్షపాతం ఇటీవల కురిసిన వర్షాలతో 53 శాతానికి తగ్గిందని, జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించామ‌న్నారు. సోమశిల పరివాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో ఒక్క టీఎంసీ కూడా ఇన్ ఫ్లో లేదని, క్రిష్ణా జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జిల్లాకు 48 టీఎంసీలు తెచ్చామ‌ని,  3.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లివ్వాలని నిర్ణయించామ‌న్నారు. కండలేరుకు 15 టీఎంసీలు మళ్లించామ‌ని, తాగునీటి అవసరాలకే వినియోగిస్తామ‌ని తెలిపారు. కండలేరు సిస్టమ్ కింద 20 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లిస్తున్నామ‌ని, గత ఏడాది 7 లక్షల ఎకరాలకు నీరిచ్చామ‌ని, 2016లో సుమారు 9 లక్షల ఎకరాలు పండించామ‌ని పేర్కొన్నారు. కరువు ప్రభావంతో ఈ ఏడాది సాగువిస్తీర్ణం తగ్గించాల్సి వ‌చ్చింద‌ని, తాగునీటి సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టామ‌ని అన్నారు. ఇంటింటికీ కుళాయి పథకానికి 1200 కోట్లతో టెండర్లు పిలిచామ‌ని, సోమశిల హైలెవల్ కెనాల్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రూ.340 కోట్లతో పాఠశాలల్లో వసతులు కల్పించబోతున్నామ‌ని, నీరు-ప్రగతి పనుల్లో చెరువుల మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చామ‌ని తెలిపారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పొంగూరు నారాయణ, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.