ZSNEWS / స‌మీప బంధువే హంత‌కుడు – వివ‌రాల‌ను వెల్ల‌డించిన ఎస్పీ ఐస్వ‌ర్య ర‌స్తోగి

48

ZSNEWS- NELLORE / నెల్లూరులో సంచలనం రేకెత్తించిన రాజస్థాన్ వ్యాపారి రాజ్ పురోహిత్ మహేంద్రసింగ్ హత్య కేసును పోలీసులు చేధించారు. హత్య కేసు ప్రధాన నిందితుడు సొంత అన్న కొడుకే అని నిర్ధారించి, సోమవారం అరెస్ట్ చేశారు. వివరాల్లో కెళ్తే…. రాజస్థాన్ కు చెందిన మహేంద్రసింగ్ కొన్ని సంవత్సరాల క్రితం వ్యాపార నిమిత్తం నెల్లూరుకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. ఆర్టీసీ బస్టాండ్ పక్కనున్న అక్కన వారి వీధిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని రైతు బజార్ ఎదురుగా కోమల్ పవర్ టూల్స్ పేరుతో షాపు తీసుకుని వ్యాపారం చేసేవాడు. వ్యాపారంలో లాభాలు రావడంతో, సంతపేటలో మరోషాప్ ఏర్పాటు చేశాడు. తన సొంత అన్నకుమారుడు విక్రమ్ సింగ్ ను అక్కడ ఉంచాడు. అంతేకాకుండా తిరుపతిలో కూడా మరోషాప్ ఏర్పాటు చేసి, అక్కడ తన అన్న మంగీలాల్ను అక్కడ ఉంచి వ్యాపారాలు సాగిస్తున్నాడు. ఈ సమయంలోనే రాజస్థాన్లో మంగీలాల్కు ఇళ్లు కట్టిస్తానని, విక్రమ్ సింగ్కు మహేంద్ర సింగ్ మాట ఇచ్చాడు. ఈ విషయంపై విక్రమ్ సింగ్ అనేక సార్లు మహేంద్ర సింగ్ను అడిగినా ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా మహేంద్ర సింగ్ రాజస్థాన్లో ఓ ఇళ్లు కట్టించి, దానిని తన భార్యపై రిజిస్ట్రర్ కూడా చేశాడు. ఇదిలా ఉంటే సంతపేట షాప్ విషయంలో సోదరుడు మంగీలాల్ కుమారుడు విక్రమ్ సింగ్ నష్టాలను చూపుతూ వచ్చాడు. దీంతో ఆగ్రహించిన మహేంద్ర సింగ్, విక్రమ్ సింగ్ను పనిలో నుంచి తొలగించాడు. దీంతో ఇద్దరి సోదరుల మధ్య వివాదం ముదిరింది. ఎలాగైనా సోదరుడిని అంతం చేయాలన్న కుట్రతో విక్రమ్ సింగ్, పలువురు కిరాయి హంతకులను సంప్రదించి, రెండుసార్లు, హత్యయత్నానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ తరుణంలోనే ఈనెల 3వ తేదిన తుపాకీతో కాల్పులు జరిపించి, హత్య చేయించాడు. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పోలీసు బృందాలను పంపి విచారణ చేపట్టారు. ఈ తరుణంలో విక్రమ్ సింగ్ పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో, అతనిని అనుమానించి, అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దీంతో విక్రమ్ సింగ్, ఈ హత్య తానే చేయించినట్లు ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫ్రెన్స్హాల్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలు తెలియజేశారు. ఈ హత్యకు సూత్రదారి అయిన విక్రమ్ సింగ్ను అదుపులోకి తీసుకున్నామని, హత్య చేసిన కిరాయి హంతకులు, వారికి సహకరించిన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఈ విలేక్ల సమావేశంలో ఎస్పీ అడ్మిన్ ఓఎస్‌డి పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు నగర డిఎస్పీ మురళికృష్ణ, సిఐ ఏకే ఖాన్ సుబాన్ తదితరులు పాల్గొన్నారు.