ZS NEWS / రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా పటిష్ట ప్రణాళికలు ..నగర మేయర్

73

ZS NEWS : 

  • 42 వ డివిజను పనుల పర్యవేక్షణలో మేయరు

నగర వ్యాప్తంగా జరుగుతున్న భూగర్భ డ్రైను నిర్మాణ పనులు పూర్తయిన అన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామనీ, సుందరమైన నగర నిర్మాణంలో అందరం భాగస్వాములవుదామని మేయరు అబ్దుల్ అజీజ్ పిలుపునిచ్చారు. స్థానిక 42వ డివిజను కోటమిట్ట, విరాట్ నగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్నఅభివృద్ధి పనులను మేయరు గురువారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూగర్భ పనుల నిర్మాణంకోసం జరిపిన రోడ్ల తవ్వకంతో ప్రజలు ఇబ్బందులకు గురవటం బాధాకరమనీ, అయితే ఈ అసౌకర్యాలన్నీ మహానగర నిర్మాణానికి జరుగుతున్న అభివృద్ధి సూచికలుగా గుర్తించాలని మేయరు పేర్కొన్నారు. భూగర్భ పనులు పూర్తయిన ప్రాంతాల్లో అత్యంత వేగంగా రోడ్ల నిర్మాణం జరుగుతోందనీ, ప్రజలంతా సంయమనం పాటించి సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటివరకు డివిజను పరిధిలో సుమారు 6కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయనీ, అందులో భాగంగా అధ్బుతమైన పార్కు నిర్మాణం, మహిళలకోసం వృత్తి శిక్షణా కేంద్రం, డ్రైను కాలువలు, డివైడర్లు, సిమెంటు రోడ్లు, పచ్చదనం, హై మాక్స్ వీధి దీపాలను ఏర్పాటు చేసామని మేయరు ప్రకటించారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రజలు సహకరించి, నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా దోహదపడాలని మేయరు కోరారు. స్థానికంగా జరిగే అభివృద్ధి పనుల్లో ప్రజల పర్యవేక్షణతో నిర్మాణాలలో నాణ్యత పెరుగుతుందని మేయరు సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనరు అలీం బాషా, టిడిపి జిల్లా నిర్వాహక కార్యదర్శి నన్నేసాహేబ్, మైనార్టీ నాయకులు షంషుద్దీన్, జాకీర్, జాఫర్, సాబీర్ ఖాన్, తాజు, ఇక్బాల్, కార్పోరేషను అధికారులూ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.