ZSNEWS- SARVEPALLI / జిల్లాలోని జలాశయాల్లో చేప పిల్లల విడుదలకు ప్రభుత్వం రూ.2 కోట్లు కేటాయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలం మండలంలోని మల్లుగుంటసంఘం వద్ద సర్వేపల్లి చెరువులో చేపపిల్లలను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వదిలిపెట్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి చెరువులో 5 లక్షల చేపపిల్లలు వదిలిపెట్టామని, జాలర్లకు వలలు, సైకిళ్లు, ఐస్ బాక్స్ లు తదితర వేట సామగ్రి కోసం రూ.22 కోట్లు కేటాయించామన్నారు. టీడీపీ పాలనలో వేట నిషేద కాల పరిహారాన్ని రూ.2 వేలు నుంచి రూ.4 వేలకు పెంచామని చెప్పారు. జిల్లాలో 11, 406 మందికి ఇప్పటికే పరిహారం అందజేశారు. మిగిలిన 3 వేల మందికి వెంటనే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటమని తెలియజేశారు. రిజర్వాయర్లలో వేట సాగిస్తూ జీవనం సాగించే వారికి కూడా పరిహారం అందించే విషయాన్ని కేబినెట్ సమావేశంలో ప్రస్తావిస్తాని తెలిపారు. మత్స్యకారులకు పింఛన్ అర్హత వయస్సు 50 ఏళ్లకు తగ్గించి జిల్లాలో 3 వేల మందికి అందజేస్తున్నామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆక్వా సాగుకు విద్యుత్ చార్జీ యూనిట్ రూ.6.86 నుంచి రూ.2కి తగ్గించామని అన్నారు. సర్వేపల్లి చెరువు ఆధునికీకరణకు రూ.11 కోట్లతో ప్రతిపాదనలు పంపామని ,త్వరలోనే నిధులు మంజూరు చేసి పనులు చేపడతామన్నారు. దళితులు, గిరిజనులు పేదలు ఎక్కువగా నివసించే జోసఫ్ పేటకు రోడ్డు వేస్తుంటే అడ్డుకునేందుకు కొందరు శతవిధాల ప్రయత్నించారని, పొదలకూరు మండలం ముదిగేడు, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులో ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకున్నారని, ఇలా ప్రతి చోట అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ కొండూరు పాల్ శెట్టి, సర్వేపల్లి టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వేపల్లి డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మత్స్య శాఖ జేడీ శ్రీహరి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.