ZSNEWS / దేవదాస్ తెలుగు సినిమా రివ్యూ అండ్ రేటింగ్

73

ZSNEWS /CINEMA – టాలీవుడ్‌లో మల్టీస్టారర్ల చిత్రాలు వస్తే సందడి భారీగానే కనిపిస్తుంది. వెండి తెర మీద ఇద్దరు అగ్ర హీరోలు కనిపిస్తే ప్రేక్షకులు, అభిమానులు పులకించిపోతారు. ఇలాంటి పరిస్థితిలో తాజాగా వస్తున్న మల్టీస్టారర్ దేవదాస్. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున అక్కినేని, నేచురల్ స్టార్ నాని దేవదాస్‌గా మారారు. వారి సరసన గీతా గోవిందం ఫేమ్ రష్మిక మందన్న, ఆక్షాంక్ష సింగ్‌లు మెరిసారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మల్టీస్టారర్ చిత్రం ఎలా ఉంది. నాగార్జున, నాని ఏ మేరకు మెప్పించారని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
దేవదాస్ స్టోరి

దేవా (మాఫియా డాన్) ఎవరూ లేని అనాధ. తన ఎవరో అనే విషయం ప్రపంచానికి తెలియకుండా మరో మాఫియా డాన్, పెంపుడు తండ్రి (శరత్ కుమార్) నీడలో పెరిగి పెద్దవుతాడు. మాఫియా అంతర్గత కలహాల కారణంగా సేఠ్ (కునాల్ కపూర్) చేతిలో పెంపుడు తండ్రి హత్యకు గురవుతాడు. వారిపై పగ తీర్చుకోవడానికి హైదరాబాద్ వచ్చిన దేవా ఎన్‌కౌంటర్‌లో గాయపడి దాసు ( నాని) వద్దకు చేరుతాడు. అప్పటికే డాక్టర్‌గా రాణించడానికి కష్టాలు పడుతూ క్లినిక్ పెట్టుకొంటున్న దాసుకు దేవా రాకతో కష్టాలు మొదలైతాయి. దేవాతో పరిచయం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది ఈ మూల కథ.

దేవదాస్‌లో ట్విస్టులు

ఇక దేవా జీవితంలోకి న్యూస్ రీడర్ (జాహ్నవి) ఎలా ప్రవేశించింది. దేవాకు జాహ్నవి ఎందుకు బ్రేకప్ చెప్పింది. దాసుతో పూజా (రష్మిక మందన్న) ప్రేమ వ్యవహారం ఎలా మొదలైంది. దాసును పూజ ఎందుకు వెంటాడుతుంది. మాఫియా జీవితానికి దేవా ముగింపు పలికాడా? కార్పోరేట్ హాస్పిటల్‌లో అవమానాలకు గురైన దాసు మళ్లీ వారి ప్రేమను ఎలా పొందాడు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం దేవదాసు సినిమా చూడాల్సిందే.

తొలిభాగం విశ్లేషణ

దేవా చిన్నప్పటి కథతో ప్రారంభమై శరత్ కుమార్, నాగార్జున బంధం ఎలా బలపడిందో అనే అంశం నుంచి అత్యవసర పరిస్థితుల్లో దాసును దేవా కలవడమనే పాయింట్ ప్రథమార్థంలో సాగుతుంది. తొలిభాగంగా వినోదానికే పెద్ద పీట వేశారు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని నవ్విస్తాయి. కాకపోతే కథనం మరీ నిదానంగా ఉండటం, నెక్ట్స్ సీన్ ఏంటో ముందే ఊహించడం లాంటి అంశాలు కొంత అసంతృప్తిని గురిచేస్తాయి. కథలో బలం లేకపోవడం పెద్దగా ట్విస్టులేమీ లేకుండా ఇంటర్వెల్ పడుతుంది.

సెకండాఫ్ విశ్లేషణ

ఇక రెండో భాగానికి వచ్చేసరికి కథంతా రొటీన్‌గా, గందరగోళంగా మారుతుంది. పలు విషయాలను సెకండాఫ్‌లోనే చెప్పాల్సి రావడం, ఇద్దరు స్టార్లను బ్యాలెన్స్ చేసే ప్రక్రియలో కథనానికి కళ్లెం వేస్తుంది. కథ, క్యారెక్టర్లలో ఎమోషన్ ఉన్నప్పటికీ, దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడంలో విఫలమైనట్టు కనిపిస్తుంది. రష్మిక, ఆకాంక్ష పాత్రలు స్క్రీన్ మీద కనపడుతున్నా వాటిలో బలం కనిపించదు. దేవ, దాసు క్యారెక్టర్లు కనిపించకపోగా.. ఆ పాత్రల్లో హీరోలే కనిపిస్తారు. కాకపోతే ప్రీ క్లైమాక్స్‌లో పిల్లాడి ఎపిసోడ్ గుండెను తడిమేస్తుంది. చివర్లో ఎప్పటిలానే పిస్టల్స్ కాల్పులు, రొటీన్ ఫైట్లతో హడావిడిగా కథను ముగించే ప్రయత్నం జరిగిందనే భావన కలుగుతుంది.

దర్శకుడి ప్రతిభ

గత రెండు చిత్రాల ద్వారా దర్శకుడు ఆదిత్య శ్రీరాం తన అస్థిత్వాన్ని చాటుకొన్నారు. ఇక మూడో సినిమాకు వస్తే ఒకడు ప్రాణం తీసేవాడు.. మరోకడు ప్రాణం పోసేవాడు అనే బేసిక్ పాయింట్ చుట్టూ కథను అల్లుకొన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలు, మరో ఇద్దరు హాట్ హీరోయిన్స్, హిందీ నటుడు కునాల్ కపూర్ లాంటి పాత్రలను కథనంలో మేలవించడంలో తడబాటుకు గురయ్యాడు. కొన్ని చోట్ల బలంగా సీన్లు రాసుకొంటే.. మరికొన్ని చోట్ల ఎలిమెంటరీ పిల్లాడు రాసుకొన్న విధంగా సన్నివేశాలు కనిపిస్తాయి. ఓవరాల్‌గా అతి కష్టంగా పాస్ మార్కులతో గట్టెక్కే ప్రయత్నం చేశాడు. కథ, కథనాల మధ్య నలిగిపోయాడనిపిస్తుంది.

నాగార్జున యాక్టింగ్

డాన్ క్యారెక్టర్లతో మెప్పించిన నాగార్జున దేవా పాత్రలో ఒదిగిపోయాడు. తెర మీద గ్లామర్‌గా కనిపించాడు. ప్రేమికుడు, స్నేహితుడు, డాన్ పాత్రలకు తగినట్టుగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకొన్నాడు. పిల్లాడి సీన్‌లో నాగ్ ఎమోషన్స్ ఆకట్టుకొన్నాయి. తన పాత్ర చుట్టు కథ, కథనాలు బలంగా లేకపోవడంతో దేవా క్యారెక్టర్ అక్కడక్కడా తేలిపోయినట్టు కనిపిస్తుంది.
నాని నటన

విలక్షమైన పాత్రలకు పెట్టింది పేరు నాని. మరోసారి పక్కింటి అబ్బాయి పాత్రలో ఆకట్టుకొన్నాడు. ఎంత పక్కింటి అబ్బాయి పాత్రైన కాస్ట్యూమ్ పరంగా డల్‌గా కనిపించాడు. డాక్టర్‌ పాత్రలో అవసరమైన చోట ఎమోషన్ పలికించాడు. ఇలాంటి పాత్రలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని నాని మరోసారి నిరూపించాడు. కథ, కథనాలకు అనుగుణంగా దాసు క్యారెక్టర్‌తో ముందుకు సాగిపోయాడు.
రష్మిక మందన్న

గ్లామర్ గీతా గోవిందం తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రష్మిక తాజాగా మరోసారి దేవదాసుతో మళ్లీ పలుకరించింది. ఈ చిత్రంలో పూజా పాత్రకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. కథకు అనుగుణంగా ట్రావెల్ అయ్యే పాత్ర. ప్రేక్షకులకు కొంత ఆశ్చర్యాన్ని కలిగించే రోల్ రష్మిక దక్కింది. గ్లామర్‌తో యాక్షన్ సీన్లలోను మెప్పించింది. నాని, రష్మిక మధ్య రొమాన్స్‌ను ఆశించి సినిమాకు వస్తే కొంత నిరాశే కలుగుతుంది. తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది.

ఆకాంక్ష సింగ్

అందాలు జాహ్నవిగా ఆకాంక్ష అందంగాను, అభినయంతో ఆకట్టుకొన్నది. చెత్త వార్తలు చదివే న్యూస్ యాంకర్ నుంచి దేవా గురించి ఇన్వెస్టిగేషన్ చేసే రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయింది. నాగార్జునతో కలిసి రొమాన్స్‌ను పండించింది. సుమంత్‌తో మళ్లీ రావా చిత్రం తర్వాత ఓ గుర్తింపు పొందే పాత్రలో నటించింది. నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది.

మిగితా నటీనటులు

ఈ చిత్రంలో మిగితా పాత్రల విషయానికి వస్తే శరత్ కుమార్, కునాల్ కపూర్, రావు రమేష్, నరేష్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, కమెడియన్ సత్య పాత్రలు అప్పడప్పుడు పలకరిస్తాయి. కథపై, ఇతర పాత్రలపై గొప్ప ప్రభావం చూపే పాత్రలు కాకపోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది. కథలో అంత స్కోప్ లేకపోవడం వారి పాత్రలను బలంగా జొప్పించడానికి వీలు చిక్కలేదనే ఫీలింగ్ కలుగుతుంది. సంపూ, నవీన్ చంద్ర, అవసరాల శ్రీనివాస్ పాత్రల ఎందుకో అర్ధం కాదు. వారు ఏం ఆశించి చేశారో అంతుపట్టదు.

సాంకేతికవర్గం

టెక్నికల్‌గా ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే సినిమాటోగ్రఫి. శ్యాందత్ పనితనం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెర మీద హీరో, హీరోయిన్లను అందంగా చూపించాడు. లైటింగ్ వాడుకొన్న విధానం బాగుంది. యాక్షన్ ఎపిసోడ్‌పై మరింత దృష్టి పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. పాటల చిత్రీకరణ, అందు కోసం వేసిన సెట్టింగులు బ్రహ్మండంగా అనిపిస్తాయి. గణేష్ పాటలో యాంబియెన్స్ చక్కగా ఉంటుంది. కొన్ని చోట్ల ఎడిటింగ్‌కు ఇంకా స్కోప్ ఉంది.

నిర్మాణ విలువలు

టాలీవుడ్‌లో ఎన్నో ప్రతిష్మాత్మక చిత్రాలను తెరకెక్కించిన ఘనత వైజయంతి మూవీస్‌కు ఉంది. చాలా రోజుల తర్వాత సీ అశ్వినీదత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రతీ ఫ్రేమ్, సాంకేతిక విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.

ఫైనల్‌గా

హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ పాయింట్‌తో వినోదాత్మకంగా రూపొందిన చిత్రం దేవదాస్. నాగార్జున, నాని కాంబినేషన్ ఈ సినిమాకు హైలెట్. రష్మిక, ఆకాంక్ష గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా భారీ విజయాన్ని అందుకొనే అవకాశాలు ఉన్నాయి.