ZS News / అన్ని మున్సిపల్ షాపులను వాడకంలోకి తిరిగి తీసుకొస్తాం

81
  – అన్ని మున్సిపల్ షాపులను వాడకంలోకి తిరిగి తీసుకొస్తాం
  – ఎసి సుబ్బారెడ్డి కాంప్లెక్సులో నిర్మాణ మార్పులకు ఆదేశించిన మేయరు
ZS News నెల్లూరు : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని అన్ని మున్సిపల్ షాపుల నిర్వహణపై సమగ్ర నివేదికను పరిశీలించి నిరుపయోగంగా ఉన్న షాపులను వాడుకలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన పటిష్ట చర్యలను చేపడుతున్నామని మేయరు అబ్దుల్ అజీజ్ ప్రకటించారు. స్థానిక చిన్న బజారులోని ఎసి సుబ్బారెడ్డి మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్సు నిర్వహణా తీరును మేయరు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్యం, సెక్యూరిటీ, నిర్వహణ, ఆజమాయిషీ లేక కాంప్లెక్సులోని 38 షాపుల్లో పది మాత్రమే వర్తకపరంగా వాడకంలో ఉండటం దిగ్బ్రాంతి కలిగించిందని అన్నారు. దుకాణ సముదాయాలనుతిరిగి వాడుకలోకి తెచ్చేందుకు నూతనంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని యుద్ధప్రాతిపదికన అమలు చేసేలా అధికారులను ఆదేశించామని మేయరు చెప్పారు. అందులో భాగంగా యజమానులందరికీ నోటీసులు పంపి, నూతనంగా దుకాణాల కేటాయింపుకు ఆక్షను విధిస్తున్నామనీ, నూతన కాంప్లెక్సు ఎదురుగా ద్విచక్రవాహనాల పార్కింగును నిషేదించి, ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాన్ని లోపల ఏర్పాటు చేస్తామని మేయరు వివరించారు. వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ఈ ప్రాంతంలోని విలువైన వ్యాపార స్థలం నిరుపయోగం కాకుండా వివిధ రకాల వ్యాపారులకు సాధారణ బాడుగలతో అందించేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఔత్సాహిక వ్యాపారస్తులు అవకాశాన్ని అందిపుచ్చుకుని వర్తకంలో రాణించాలని మేయరు సూచించారు. అదేవిధంగా పణతులవారి వీధిలోని సపోటా మార్కెట్టు స్థానంలో నూతన రెండతస్తుల భవనాన్ని నిర్మించి వస్త్రాల వ్యాపార రంగంలో వృత్తి శిక్షణ పూర్తి చేసుకున్న స్వయం ఉపాధి మహిళలకు కేటాయిస్తామని మేయరు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనరు వెంకటేశ్వర్ రావు, అధికారులు రాజేశ్వరి, కార్పొరేటరు సత్య నాగేశ్వర్, నాయకులు నన్నేసాహేబ్, షంషుద్దీన్, అబ్దుల్ మస్తాన్, సాబీర్ ఖాన్, సుభహాన్, పాషా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు.