ZS NEWS/ ఈ సెక్స్ వర్కర్లు తమ డబ్బును ఎక్కడ జమ చేయాలి?

85
ZS NEWS / సెక్స్ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు చేతులెత్తేసింది.
ముంబైలో ఉన్న కామాటిపురను భారతదేశంలోని రెండో అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా చెబుతారు. ఆసియాలోనే అతి పెద్ద రెడ్‌లైట్ ఏరియా కోల్‌కతాలోని సోనాగాఛీ తర్వాత కామాటిపుర పేరే చెబుతారు. ఇక్కడివారికి ఇప్పుడో కొత్త సమస్య వచ్చి పడింది.
ఇక్కడ సుమారు 5 వేల మంది సెక్స్ వర్కర్లు నివసిస్తున్నారు. భారత్‌లో సెక్స్ వర్క్ అక్రమం కాబట్టి తమ జీవితంలో ఇన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అక్కడి మహిళలు చెబుతారు.
సమాజంలో ఈ మహిళలకు ఎలాంటి గుర్తింపు లేదు. మనుగడ కోసం వారి దగ్గర రుజువుగా ఎలాంటి అధికారిక పత్రాలూ లేవు.
ఈ మహిళలకు ఇప్పుడొక కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సెక్స్ వర్కర్లు తమ సంపాదన జమ చేసుకునేందుకు ఒకే ఒక బ్యాంక్ ఉండేది. ఇప్పుడు అది కూడా మూతబడింది.
కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలో ఉండే 5 వేల మంది సెక్స్ వర్కర్లలో ఎక్కువ మందికి ఏ ప్రధాన బ్యాంకుల్లోనూ ఖాతాలు లేవు.
కొంతమంది సెక్స్ వర్కర్లు “ఖాతా తెరవాలంటే బ్యాంక్ వాళ్లు ఆధార్ కార్డ్, తమ దగ్గర లేని ఇతర పత్రాలు అడుగుతున్నారని చెబుతున్నారు. అందుకే బ్యాంకుల సేవలు పొందడం ఈ మహిళలకు ఎప్పుడూ సవాలుగా నిలుస్తోంది.
అయితే, సెక్స్ వర్కర్లకు సాయం అందించేందుకు, 2007లో కామాటిపుర రెడ్ లైట్ ఏరియాలో ఒక ప్రభుత్వ బ్యాంకు ఏర్పాటు చేశారు.
దాని పేరు సంగిని విమెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్. దీన్ని ఫండింగ్ లోటు కారణంతో గత ఏడాది డిసెంబర్‌లో మూసేశారు.
ఇక్కడ సెక్స్ వర్కర్స్‌కు వచ్చే సమస్యలను పరిష్కరించడానికే సంగిని విమెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.
“సంగిని బ్యాంకులో కేవలం ఒక ఫొటో ఇస్తే చాలు సెక్స్ వర్కర్లకు ఖాతా తెరిచేవారు” అని ఈ సహకార బ్యాంక్‌కు చెందిన కొందరు వ్యవస్థాపక సభ్యులు చెప్పారు.
ఈ బ్యాంకును 2007లో అమెరికాకు చెందిన ఒక సంస్థ నిధులతో ఏర్పాటు చేశారు. కానీ 2009లో ఆ సంస్థ నిధులు ఇవ్వడం ఆపేసింది.
ఆ తర్వాత బ్యాంకు కార్యకలాపాల బాధ్యతను ఇండియా-800 ఫౌండేషన్ తీసుకుంది. కానీ కొంతకాలం తర్వాత ఇండియా-800 ఫౌండేషన్ సంగిని బ్యాంక్‌ నుంచి విడిపోయింది.
సంగిని బ్యాంక్ కోల్‌కతాలోని సోనామాఛీ రెడ్ లైట్ ఏరియాలో ఉన్న ఉషా కో-ఆపరేటివ్ బ్యాంక్‌లా నడుస్తుందని అనుకుని ప్రారంభించారు. కానీ ఈ బ్యాంక్ పదేళ్లలోనే చేతులెత్తేసింది.
డబ్బు పొదుపు చేయడంలో ఈ బ్యాంక్ తమకు చాలా సాయం చేసిందని కొంతమంది సెక్స్ వర్కర్లు చెబుతారు.
“సంగిని బ్యాంకులో కొంతమంది 64 వేల రూపాయల నుంచి 5 లక్షల వరకూ జమ చేశారు. కామాటిపురలో రోజుకు 200 నుంచి 2 వేల వరకూ సంపాదించే మహిళలకు అది చాలా పెద్ద మొత్తమే” అంటారు చాంద్ బీ.
సెక్స్ వర్కర్ తనూజా ఖాన్‌కు సంగిని బ్యాంకులో ఖాతా ఉండేది, ఇప్పుడు తన డబ్బు ఏం చేయాలా అని ఆమె దిగులు పడుతోంది.
“మేం సంపాదించే డబ్బును, ఇప్పుడు భద్రంగా కాపాడుకోవడం కష్టమైపోయింది. బ్యాంక్ మూతబడడంతో మా కష్టాలు పెరిగాయి. పడక దగ్గర 500 నుంచి వెయ్యి రూపాయలు పక్కన పెడితే చాలు, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్లిపోతారు. అందుకే డబ్బులు ఎక్కడో ఒకచోట కనిపించకుండా దాయాల్సివస్తోంది” అని తనూజా చెప్పారు.
“ఇక్కడ బట్టలు, పాత్రలు కూడా దొంగిలిస్తారు. అలాంటప్పుడు డబ్బు బయటెలా ఉంచగలం” అంటున్నారు మిగతా మహిళలు
అయితే, బ్యాంక్ మూతబడడం వెనుక ప్రధాన కారణం నిధుల లోటు. దాని వల్లే ఇప్పుడు కామాటిపురలో చాలా మంది మహిళల భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది.
Attachments area