ZS News / 61 ఏళ్ల తర్వాత రెండో బౌలర్‌గా కేశవ్‌ మహరాజ్‌

69

ZS News ( International ) : దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఈ సఫారీ స్పిన్నర్‌ 9 వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో టెస్ట్‌ ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా రికార్డుకెక్కాడు. 61 ఏళ్ల అనంతరం ఈ రికార్డును కేశవ్‌ అందుకోవడం విశేషమైతే.. లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం.

1957లో తొలిసారి దక్షిణాఫ్రికా బౌలర్‌ హగ్‌ టైఫీల్డ్‌ ఈ ఘనతను అందుకున్నాడు. జోహన్నస్‌బర్గ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హగ్‌ టైఫీల్డ్‌ ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు పడగొట్టాడు. తాజాగా కేశవ్‌ ఈ రికార్డును సమం చేశాడు. కేశవ్‌ దెబ్బకు శ్రీలంక 338 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన సఫారీ జట్టు సైతం 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పోరాడుతుంది.