ZS News / అట్టహాసంగా ప్రారంభమైన మున్సిపల్ పాటశాలల క్రీడా ఉత్సవాలు

84
– ఆద్యంతం ఉత్సాహం ప్రదర్శించిన విద్యార్ధులు
– గాంధీ బొమ్మ కూడలి నుంచి స్టేడియం వరకు క్రీడా జ్యోతి ప్రదర్శన ర్యాలీ
– ఆకట్టుకున్న వివిధ రాష్ట్రాల జానపద సాంప్రదాయ కళారూపాలు
– మేయరు, కమిషనరు జట్ల మధ్య హోరాహోరీ క్రికెట్టు పోటీ
– విజేతగా నిలిచిన మేయరు జట్టు
– క్రీడలూ, బాణాసంచా, బెలూన్లతో స్టేడియంలో అంబరాలు అంటిన సంబరాలు
– ట్రాఫిక్కు క్రమబద్ధీకరణలో పోలీసుల సేవలు ప్రశంసనీయం 
ZS News (Nellore) నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ పాటశాలల విద్యార్ధులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు తొలిసారిగా చేపట్టిన కీడా ఉత్సవాలు నగరంలో శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గాంధీ బొమ్మ కూడలిలో మేయరు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకానాథ్, కమీషనరు అలీం బాషాల సారధ్యంలో వివిధ డివిజనులకు చెందిన కార్పోరేటర్లు, అన్ని మున్సిపల్ పాటశాలల విద్యార్ధులు వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధరాష్ట్రాలకు చెందినా కళాకారులు ప్రదర్శించిన కళా రూపాలు విద్యార్ధులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం కోయా కొమ్ము బృందం నృత్య ప్రదర్శన, కేరళ రాష్ట్రం గురువాయూర్ ఆలయ బృందం ప్రదర్శించిన చండీ మేళం ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతరించి పోతున్న మనరాష్ట్ర సంప్రదాయ కళలను విద్యార్ధులకు చూపేందుకు మేయరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్క భజన, కోలాటం, డప్పు కళాకారుల బృందం, పగటి వేషగాళ్ళ ప్రదర్శనలు విద్యార్ధుల్లో నూతనోత్తేజం రగిల్చాయి.
తొలుత కూడలిలోని గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి మేయరు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్రీడా జాతిని వెలిగించి విద్యార్ధులతో కలిసి ర్యాలీని చేపట్టారు. గాంధీ బొమ్మ కూడలినుంచి సాగిన ర్యాలీలో వివిధ కూడళ్ళలో మున్సిపల్ పాటశాలల విద్యార్ధులు ప్రధాన ర్యాలీకి తోడయ్యారు. వి ఆర్ సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం నృత్య కళాకారుల బృందంతో కలిసి మేయరు నృత్యాలు చేసి విద్యార్ధులను ఉత్తేజ పరిచారు. స్టేడియం వరకు నిరాటంకంగా వేలమంది విద్యార్ధులతో భారీ ర్యాలీ సాగడంలో ట్రాఫిక్కు పోలీసుల విధి నిర్వహణ అత్యంత ప్రశంసనీయమని మేయరు అభిప్రాయం వెలిబుచ్చారు. కార్పోరేషను నిధులతో ప్రతీ పాటశాలకు ప్రత్యేకమైన నూతన యూనిఫారం దుస్తులను అందించి అత్యంత క్రమశిక్షణతో క్రీడా జ్యోతి ర్యాలీని నిర్వహించినందుకు పాటశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులను మేయరు ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా ట్రాఫిక్కును క్రమబద్ధీకరిస్తూ, ర్యాలీ మధ్యలో విద్యార్ధులు దాహార్తికి గురవకుండా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లను నిరంతరం అందించిన మేయరు యువసేన కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మహా ర్యాలీగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం చేరుకున్న విద్యార్ధులు, ఎన్ సిసి కాడెట్లు క్రీడోత్సవాలను పురస్కరించుకుని పాటశాలల వారీగా ముఖ్య అతిధులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం, క్రీడా పతకాలను మేయరు, కమీషనరులు ఆవిష్కరించారు. క్రీడల ప్రారంభాన్ని సూచిస్తూ మహా క్రీడా జ్యోతిని ముఖ్య అతిధుల సమక్షంలో మేయరు, డిప్యూటీ మేయరులు వెలిగించి, బెలూన్లూ, శాంతి కపోతాలను ఎగరవేశారు. అనంతరం ప్రతిష్టాత్మక మేయరు కప్పును కమీషనరు అలీం బాషాతో కలిసి మేయరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు నిర్వహించిన క్రీడల పోటీల్లో పలువురు విద్యార్ధులను విజేతలుగా నిర్వాహకులు ప్రకటించారు. విజేతలందరికీ 11వ తేదీన విఆర్ సి విద్యా సంస్థల మైదానంలో జరిగే వార్షికోత్సవం రోజు బహుమతులు అందించనున్నారు.